విశాఖపట్టణం (సింహాచలం),(నిఘా ప్రతినిధి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించనున్న వార్షిక చందనోత్సవాన్ని సమష్టి కృషితో విజయవంతంగా నిర్వహించాలంటూ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జె. వెంకటరావు పిలుపునిచ్చారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అన్ని విధాలుగా సహకరించాలని సంబంధిత శాఖల అధికారులను విజ్ఞప్తి చేశారు. శనివారం ఆలయ పరిధిలోని క్యూ కాంప్లెక్స్ భవనంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన విస్తృతంగా చర్చించారు. గత అనుభవాలను పునఃసమీక్షించి, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సమగ్ర ప్రణాళికతో చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు దిశగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
దర్శన సమయాలు – ప్రత్యేక ఏర్పాట్లు
ఏప్రిల్ 20న ఉదయం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని, అంతరాలయ దర్శనాలు ఎవరికి ఇవ్వాలన్నది జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. రూ.1500/- వీఐపీ టిక్కెట్లను మొబైల్ నంబర్ల ఆధారంగా బ్యాంకుల ద్వారా జారీ చేయించేందుకు ఐటీ విభాగం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రవేశ ద్వారాల వద్ద క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా భక్తులను వేగవంతంగా అనుమతించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బస్సుల సంఖ్యను వీలైనంత వరకు తగ్గించాలని, ఏసీ బస్సుల సంఖ్యను కూడా తగ్గించేస్తే బాగుంటుందని చర్చించారు. బస్సుల నిర్వహణలో పోలీసులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
భక్తుల సౌకర్యార్థం ఐదు వరుసలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 100 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయాలన్నారు. అప్‌హిల్, డౌన్‌హిల్ ప్రాంతాల్లో పూర్తి స్థాయి లైటింగ్, మొబైల్ టాయిలెట్ల, తాగునీటి వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టాలని, బెడెడ్ తో కూడిన తాత్కాలిక ఆసుపత్రిని, అంబులెన్స్ల లను ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలని, ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు ఉండేలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సిఫ్ట్ వారీలుగా సిబ్బందిని నియమించాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలన్నారు. బస్సుల ఫిట్‌నెస్ తనిఖీ చేసి, ప్రతి పాయింట్ వద్ద పర్యవేక్షణకు మేనేజర్లను నియమించాలని సూచించారు. చందనోత్సవం రోజున అప్‌హిల్ ప్రాంతంలోని అన్ని దుకాణాలు, ఉప ఆలయాలు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
