వసతి దీవెన సాయం సగమేనా?



*వసతి దీవెన సాయం సగమేనా?*



అమరావతి:

*ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్ల మిగులు!*


★ ప్రభుత్వం గడిచిన రెండు విద్యా సంవత్స రాల్లో వసతి, భోజన ఖర్చుల కింద ఇచ్చే వసతి దీవెన సాయం సగమేనా? అనే విమర్శలు విద్యార్థుల నుంచి వినిపిస్తున్నాయి. 


★ వసతి దీవెన కింద ఏటా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. 


★ 2020-21 విద్యాసంవత్సరానికి కరోనా వ్యాప్తి నేపథ్యంలో తరగతులు జరగలేదని.. ఆ ఏడాదికి సగమే ఇచ్చారు. దీంతో రూ.1000 కోట్లకు కోత వేసినట్లయింది. 


★ తాజాగా 2021-22. విద్యాసంవత్సరానికి వసతి దీవెన కింద రూ.1,024 కోట్ల మొత్తం రెండో విడతగా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. అంటే 2021-22 ఏడాదికి కూడా ఇచ్చేది సగమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. 


★ ప్రభుత్వం గత విద్యాసంవత్సరం (2020-21) లాగే ఇప్పుడూ ఒక విడత చెల్లింపునకే పరిమితం అవుతుందా? లేదా మరోసారి మిగిలిన మొత్తం విడుదల చేస్తుందా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

★ 2021-22 ఏడాదికి కూడా సగమే ఇస్తే ప్రభుత్వం మరో రూ.1000 కోట్లు మిగుల్చుకున్నట్లు అవుతుంది. 

★ దీంతో మొత్తంగా రెండేళ్లలో రూ.2 వేల కోట్ల మేర ప్రభుత్వానికి మిగలనుంది.