ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి అని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వైటి దాస్ పిలుపునిచ్చారు. ఈరోజు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఎస్ ఎం ఎస్-1 విభాగం కార్యకర్తల సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వైటి దాస్ మాట్లాడుతూ నేటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది అంటే ప్లాంట్ లో గుర్తింపు యూనియన్ గా సి ఐ టి యు వాటి మిత్రపక్షాలు చేస్తున్న కృషి అనిర్వచనీయం అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజలలో అవగాహన మరింత అభివృద్ధి చేసి ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన ఘనత సీఐటీయూ దక్కుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక సదస్సులకు రాష్ట్ర సిఐటియు సహకారంతో జరిగినవే అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే అంగన్వాడి, ఆశ వర్కర్స్, యువజనులు, మహిళా సంఘాల ప్రతినిధులు దీక్షా శిబిరానికి వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారని, వీటికోసం సిఐటియు కృషి ఎంత ఉందో ప్లాంట్ లోని ప్రతి ఒక్క కార్మికుడు ఈ విషయాలను గమనించారని ఆయన అన్నారు. ఈ సమయంలో వేరొకరు గుర్తింపు లో ఉంటే దీని పై జరుగుతున్న దాడిని కార్మిక వర్గం వరకు తీసుకు వచ్చేవారా అని ఆయన ప్రశ్నించారు. కనుక రానున్న సమయంలో పోరాటాలను మరింత ఉధృతం చేయాలని తద్వారా ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించడంలో సిఐటియు ముఖ్యభూమిక పోషించాలి అంటే స్థానికంగా సిఐటియు మరింత బలోపేతం కావాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో స్టీల్ సిఐటియు నాయకులు బి. అప్పారావు, వి డి వి పూర్ణచంద్రరావు, బి.తౌడన్న, ఎమ్.వి.రమణ, బంగారు నాయుడు, కృష్ణమూర్తి, విశ్వనాథం, ముత్యాల నాయుడు, కె వి సాగర్, ఎమ్ ఎస్ రాజు, ఎలమంచిలి శ్రీనివాసరావు తదితరులతోపాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.