విశాఖపట్నం, ( నిఘాప్రతినిధి): భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని సంయుక్త కలెక్టరు (అభివృద్ధి, సంక్షేమం) ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఆయన జిల్లా కలక్టరు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు గౌరవ భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నగరంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. 7 వ తేదీన స్వాగత సత్కారం, ఆయన పాల్గొనే కార్యక్రమాలు ఎటువంటి లోటు లేకుండా ప్రణాళికా యుతంగా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల అధికారులందరూ వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు ముందుగా చేయాలని సూచించారు. సోమవారం ఉపరాష్ట్రపతి పాల్గొనే మెరైన్ ఫిషరీస్ పరిశోధనా సంస్థ సందర్శన, మంగళవారం నిర్వహించే వెబ్ నార్ కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. గౌరవ ఉపరాష్ట్రపతి బస, పర్యటనలు, వీడ్కోలు నిత్యం వారికి అవసరమైన అన్ని విషయాలపై దృష్ఠి పెట్టి పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, ట్రాఫిక్ లలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. వైద్యశాఖ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా వుండాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్సింగ్ లో ప్రత్యేక ఉప కలెక్టర్లు సి.హెచ్.రంగయ్య, ఎం.వి.సూర్యకళ, మత్స్యశాఖ జె.డి. కె.ఫణిప్రకాష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, జి.వి.యం.సి, విద్యుత్ శాఖ, విపత్తు నిర్వహణ, పౌర సరఫరా తదితర శాఖల అధికార్లు పాల్గొన్నారు.
జారీ ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం